Tuesday, December 6, 2011

నా మహానగరం

ఆరంతస్థుల మేడపైనుండి
ఆశ్చర్యం నిండిన కళ్ళతో
చూస్తూ నిలచి పోయానొక
అద్భుత దృశ్యాన్ని ఆ రాత్రి

పిడికిళ్ళతో విరజిమ్మిన
వజ్రాల ధగధగలు ఒక వైపు
హారాలుగా తీర్చిన వైడూర్యాలు ఇంకొక వైపు
మంచి ముత్యాల తోరణాలు మరో వయిపు
అందంగా పొదిగిన కెంపులూ, నీలాలూ, పచ్చలూ అక్కడక్కడా!

మణిమయమై భాసిల్లుతోంది
ఎల్లలు దాటిన ఈ మహానగర సౌందర్యం

అక్కడ, ఆపైన నిలచి ఉన్నప్పుడు
హోరెత్తించే రణగొణ ధ్వనులు వినపడలేదు;
అదృష్టవశాత్తూ - పేరు తెలియని ఫ్యాక్టరీలు వదిలే
విష వాయువులు చుట్టుముట్టలేదు;
రోడ్ల పక్కన పెంట కుప్పలు,
అన్ని దిక్కులా పరుచుకున్న వాడేసిన ప్లాస్టిక్ కవర్లు
కనిపించలేదు

నాకు తెలుసు,
ఆ దీపాల తోరణాలు కట్టిన వీధులలో
గోముఖ వ్యాఘ్రాలు తిరుగుతుంటాయని
ఆ జనారణ్యంలో, చీకటి మూలలలో
తోడేళ్ళు అవకాశం కోసం మాటువేసి వేచి ఉంటాయనీ

ఆ సిమెంట్ వనాలలో దీపపు క్రీనీడలలో
దోపిడీలు, దౌర్జన్యాలు సర్వసామాన్యమనీ
సాటిమనిషి చేసే ఆర్తనాదం అరణ్య రోదనమేననీ
మేడమెట్లు దిగి వస్తే ఆ సెగలూ, పొగలూ
నన్ను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయనీ

అయినా,
ఆ ఆలోచనలన్నీ మరిచి నిలిచాను
సంభ్రమంగా చుట్టూ చూసాను

మనిషి సాధించుకున్న అద్భుత ప్రపంచమది
రాత్రికి, పగటికి తేడా తెలియనివ్వనంటోంది

దూరదూరాల నుండి తరలి వచ్చే వారిని
అక్కున చేర్చుకుంటోంది
బ్రతుకు తెరువు చూపించి
బ్రతక మంటోంది

ప్రేమిస్తాను - ఈ నగరాన్ని,
కాంక్షిస్తాను - దాని పురోభివృద్దిని,
కోరుకుంటాను - దానికి జరా,మరణాలు వద్దని.
౧౪.౦౩.౦౩

Monday, December 5, 2011

మళ్ళీ ఉగాది

ప్రతి ఏటా వచ్చినా నవనవోన్మేషమే!

అణువణువునా వసంత శోభ నిండిన
ప్రకృతి సొగసు రమణీయమే!

ముంగిట విరిసిన మల్లెల, జాజుల
పరిమళమే - అది సురభిళమే!

కొసరి కొసరి కూసే కోయిల కలస్వనమునకు
మరి మరి మురిసిన మది రాగరంజితమే!
వేప చేదు చవిచూపినా రసాస్వాదనమే!

కర్మఫలం తప్పదని తెలిసినా
పంచాంగ శ్రవణ కుతూహలమే!

ముసిరే నిరాశా నీలి నీడల మధ్య
ఈ పండగ సంబరమొక అందమైన విరామమే!

చిత్ర విచిత్ర గతుల ఏతెంచిన
"చిత్రభాను" ను కోరేది ప్రశాంత జీవనమే!
౧౩.౪.౦౨

Sunday, December 4, 2011

ఆ అదృష్టం

నిదురమ్మ ఒడిలోన సేదదీరాలంటూ
పట్టె మంచము నెక్కి మేను వాల్చాను

కునుకు తునకలు నన్ను జోకొట్టినాయి
కలల అలలే నన్ను ఊయలూపాయి

తనివి తీరిందంటు అనిపించనేలేదు
స్వప్న లోకాలింకా వదిలి పెట్టనె లేదు!

పనివేళ నీకంటు కుకుకూలు పాడింది
గడియార కోయిల గమకాల తోటే

విడలేము మేమంటు బిగుసుకునే రెప్పలను
బుజ్జగిస్తూ నేను విడదీసి లేచాను
మరొక రోజు మొదలంటు పక్కదిగి నడిచాను

కరువు తీరా నిద్ర నాకెప్పుడో నంటు
మదిలోన తలపోస్తూ మొగము కడిగాను

టీ కప్పుతో నేను సిద్ధమయ్యేసరికి
ఎదురుగా వచ్చాడు 'సూరీడు గారు'

దూర దేశాలన్ని తిరిగి తిరిగొచ్చాడు
అలసినా, సొలసినా, సెలవు పెట్టగ లేడు

నాకు మాత్రముందా కునుకు సుఖమైనా అని
ఉదయాన్నె విసుగుతో వేడెక్కు తున్నాడు
౮.౧౦.౦౧

Saturday, December 3, 2011

రమ్మని పిలిచే - పలికేటివాడు

ఒకసారి రమ్మని పిలిచేవు నీవు
ఏడుకొండల నెక్కి నిలిచి ఉన్నావు
రమ్మని సులువుగా అంటావు నీవు

ఏనాడు, ఏ ఋతువు, ఏ వారమయినా
నీకు ఎల్లప్పుడూ నిత్య కల్యాణం
నీ గుడి చుట్టూ భక్తుల కదలని తోరణం

పిలిస్తే పలికేటి స్వామివి నీవు
సమ్మోహ పరుస్తావు
సాంత్వనము నిస్తావు
సత్వర దర్శనమేల ఇవ్వనంటావు ?

ఏలాగో ఒకలాగు నీ చెంతకు చేరినా
రెప్పపడి లేచేటి ఆ క్షణము లోనే
ఇక చాలు పదమంటు తరిమేరు వారు

నీముందు నే నిలచి, చేతులే జోడించి,
కనుల నిండుగ నిను నింపుకొను భాగ్యము
ఏనాడు కలుగునో చెప్పగలవా నీవైన

బంగారు పూతల ఆవాస మెందులకు?
కన్ను చెదరించేటి భూషణాలెందులకు?
అడుగడుగున అన్ని రక్షణలు ఎందులకు?
గర్భగుడిలో నీవు బందీగ ఎందులకు?

ఆకాశమే కప్పు భూదేవి పీఠం అని
ఆరు బయలే నువ్వు సభ తీర్చరాదా!

అది నీకు పడదంటే మా మనసులోనే
పగలైన రేయైన కొలువుండరాదా!
౨౪.౧౦.౦౧

Friday, December 2, 2011

చదువుల తల్లికి

"సరస్వతీ నమస్తుభ్య"మంటూ
"తల్లీ నిన్ను దలంచి పుస్తకము
చేతను పూనితి" నంటూ
చిన్ననాటి నుండి నేర్చేను నేను

నీ కటాక్షమే మరి నాకున్నదంటూ
ఎన్నడయినా తలుచుకుంటాను నేను
ఈనాడు నీ కరుణ మరింతగా పొంగి
నను తబ్బిబ్బు చేసెనే "ఓ చదువుల తల్లి"

కలనయిన చూడనిది కనుల ముందుంచేవు
ఆనంద కెరటాల తేలియాడించేవు
వ్రాతనే మరిచాను అని తలచేటి వేళ
కలమునే పట్టించి, కవితలే వ్రాయించి,
నా వలన కానిదే నా వశము చేసేవు

ఏమివ్వగలదాన నెన్నడైనను నీకు
దోసిలే పడతాను, శిరసొంచి మొక్కుతాను,
నీ చరణ కమలాలకీ పుష్పమర్పిస్తాను
౨౩.౧౦.౦౧

Thursday, December 1, 2011

మనసు

చిత్రాలు పోతుంది చిత్రాంగి మనసు
మాయలే చేస్తుంది మాయదారి మనసు

ఊహలల్లుకుని తాను ఊళ్ళేలి వస్తుంది
ఉన్నచోటునే మరి ఉలికులికి పడుతుంది

కోర్కెల గుర్రమెక్కి పరుగులే తీస్తుంది
అంతలోనే, వైరాగ్య వీధుల విహరించ బోతుంది

ఆనంద శిఖరాలు చుంబించు తానే
నైరాశ్య మరుభూమి నాశ్రయిస్తుంటుంది

దూరమై ఉన్నప్పుడు దిగులు, గుబులంటుంది
దగ్గరకు వారొస్తే పంతాలకు పోతుంది

స్వార్థమై ఒకసారి సంకుచితమవుతుంది
వితరణతో ఒకసారి ఇచ్చెయ్యమంటుంది

ఈర్ష్యకు గురియై ఓర్వలేని తానే
అందరి మంచినీ కోరుకోమంటుంది

ముక్కుమొగ మెరుగని వారికై కన్నీరు పెడుతుంది
ఎదుటి వారితో తాను గిరిగీసుకుంటుంది

కోపమూ తనదే, దుఃఖమూ తనదే!
సంతోషమూ తనదే, నైరాశ్యమూ తనదే!

పగలూ, ప్రతీకారాలు, దాన, సౌశీల్యాలు
అన్నిటికి నెలవై మనలోన కొలువుంది

కనిపెట్టి ఉండాలి కాచుకుంటుండాలి
సరియైన దారిలోకి మళ్ళించుకోవాలి
౨౨.౧౦,౦౧

Tuesday, November 29, 2011

ఆ అనుకోని అతిధులు

ఈ జీవన సంధ్యా సమయంలో
నా మది తలుపులు తట్టి
నా ముందర నిలిచాయి
ఏవో ఊహలు

"ఎవరు మీరు?" అని అడిగితే
''కాబోయే కవితలం"
అని గుసగుసగా చెప్పాయి

ముందు చెప్పకుండానే
నేను పిలవకుండానే
వచ్చేసిన ఈ "అనుకోని అతిథులు"
నాకు ఆనందమే తెచ్చాయి
ఒక కొత్త ఉత్సాహమే ఇచ్చాయి

అయినా

అనుమానంగా అడిగేను
ఏం కావాలి మీకని
"కొత్త బట్టలు కావాలి,
నువ్విస్తే
మీఇంట నిలిచుంటాం,
నీ పేరు పెట్టుకుంటాం"
అన్నాయి

"జరీ చీరలు నేయలేను,
తళుకు బెళుకులద్దలేను,
తరతరాలు నిలిచే తత్వం
నేనేమీ మీకివ్వలేను"
అని తటపటాయించేను

చిరునవ్వు నవ్వేయి
ప్రేమగా చూసేయి
"ఆకాశంలో అన్ని చుక్కలున్నాయి,
అన్నిటికీ పేరుందా? ఉన్నా,
అది అందరికీ తెలిసిందా?"
అన్నాయి నెమ్మదిగా!

సందేహాలొదులుకుని
సమాధానపడ్డాను
నా దగ్గర ఉన్న కొద్దిపాటి
పదాలనే పైకి తీసి
అలిబిలి గా అల్లేసి
నా శక్తి ఇదేనంటూ
వాటికి అందించాను

కవితలుగా తాము మారి
కళ్ళముందు నిలిచాక
కళగానే ఉన్నాయి
కిలకిలమన్నాయి

చిన్ని చిన్ని కాంతులతో
ఇల్లంతా తిరుగుతాయి
మా ఇంటికి ఎవరొచ్చినా
తాము పలకరిస్తాయి.
౧౯.౧౦.౦౧

Monday, November 28, 2011

బుట్టబొమ్మ

పట్టుచీర కట్టింది
బుట్టజూకాలు పెట్టింది
చక్కనైన వడ్డాణానికి
నడుము కాస్త చిక్కింది
అందమైన పూలజడ
ఒద్దికగా అమరింది

బంగారు గాజుల మిలమిలలు
మట్టి గాజుల గలగలలు
కలహంస నడకలకు
జతలయ్యే మంజీర నాదాలు
కెంపులు పూసిన గోరింట చేతులకు
పోటీ కాదా ఆ పారాణి పాదాలు!

తొంగి చూస్తోంది తలపైనుండి
మంచి ముత్యాల పాపిడి చేరు
అన్నిటికన్నా అపురూపం
ఆ నొసటన కళ్యాణ తిలకం
చెడు చూపు పడనివ్వని
ఆ దిష్టి చుక్కే అందం

ఆమె శిరసు వంగుతోంది మాటిమాటికీ
తలలోని మల్లెల బరువుకా
ముంచుకొస్తున్న సిగ్గుల భారానికా!

పరిహాస మాడితే బుగ్గల్లో గులాబీలు
చిరుకోపం నటించి బిగబట్టినా పెదాలు
ఆమెకది ఇష్టమేనని చెపుతున్నాయామె కళ్ళు

ముగ్ధంగా, స్నిగ్ధంగా, ముచ్చటగా ఉన్నాది
బుట్టలో కూచోబోయే బుట్టబొమ్మ ఆ కొమ్మ

ఆ కొబ్బరాకు పందిళ్ళు తనకోసం
ఆ మామిడాకు తోరణాలు తనకోసం
ఆ అందాల ముగ్గులు తనకోసం
ఆ సన్నాయి మేళాలు తనకోసం
ఆ పన్నీరు అత్తర్లు తనకోసం
ఆ చెమ్కీల దండలు తనకోసం
ఆ ఇల్లంతా సందళ్ళు తనకోసం
అందరూ వెతికేది తనకోసం
కానీ
తనచూపు వెతికేది ఎవరికోసం!
ఇక గడియో, క్షణమో
తన ముంగిట నిలిచే,
జీవితాంతమూ తన తోడై నడిచే,
ఆ కళ్యాణ సుందరుడికోసం,
ఆ తన మనోహరుడికోసం.
౧౪.౧౦.౦౧

Sunday, November 27, 2011

ఇంద్రజాలం

ఎక్కడివో ఈ ఆకాశానికి ఇన్నిన్ని అందాలు
శూన్యంలోనే ఎన్నో చూపే ఈ చక్కటి చందాలు

సూరీడొచ్చేలోగా అద్దే అద్భుతమైన ఆ రంగులు
సంధ్యాదీపం పెట్టే వేళకు మొలిపించే ఆ చుక్కలు
రాత్రికి తన ప్రాంగణమంతా మెరిసే ముత్యాల ముగ్గులు

నీరెండలో మిడిసిపడే ఇంద్రధనుసు వర్ణాలూ
వేసవి రాత్రులు మురిపించే ఆ మెరుపు కన్నెలూ
భయపెట్టే ఆ గర్జించే గొంతులూ
వర్షర్తువులో దూసుకువచ్చే నల్లని మబ్బుల గుంపులు
శరజ్జ్యోత్స్నలో అల్లనసాగే తెలి మేఘమాలికలు

ఎంతటి తాపం ఉపశమించే చల్లని తొలకరి జల్లులు
వణికించే ఆ చలికాలంలో గోరువెచ్చని ఎండలు

ప్రతి పున్నమికీ కురిపించే ఆ పాల వెన్నెలలూ
అమావాస్య రాత్రులలో మెరిపించే ఆ జరీ చీరలూ

అన్నీ తనవే నంటుంది
ఇంద్రజాలమే చేస్తుంది
౨౦.౯.౦౧

Saturday, November 26, 2011

పెద్దలకు మాత్రమే

చిటి చిటి పరుగుల చిట్టిపాపా!
అమ్మ చెయ్యి వదలని ముద్దుపాపా!
దోచబోతారమ్మా నీ బంగారు బాల్యాన్ని
చేర్చబోతారమ్మా నిన్నొక 'స్కూల్' లోని

పొద్దున్నే నిను లేపేస్తారు
గబగబ పళ్ళు రుద్దేస్తారు
చకచక నీళ్ళు పోసేస్తారు
'యూనిఫాం' తగిలిస్తారు
వద్దన్నా 'టై ' బిగిస్తారు

నోట్లో 'టిఫిన్' కూరేస్తారు
వేడిపాలు పట్టేస్తారు
కత్తిరించిన పొట్టిజుత్తును
హడావిడిగా దువ్వేస్తారు

పాదాలకు తొడుగులు తొడిగి
'బూటు'లలో బంధిస్తారు
బిరబిర చరచర లాక్కుపోయి
అక్కడ వదిలేసొచ్చేస్తారు

గోరుముద్దలు ఇక డబ్బాలపాలు
కరవేలే నీకిక అమ్మ మురిపాలు
అక్కడంతా 'డిసిప్లిన్'
అందరికీ దొరకదు 'ఎఫెక్షన్'

హిస్టరీలు,జాగ్రఫీలు,'జనరల్ నాలెడ్జి'
హడలేసే లెక్కలు, 'ఐన్ స్టీన్' సూత్రాలు
ఒకటో తరగతికే గోతాముడు పుస్తకాలు
స్లిప్ టెస్టులు,యూనిట్లు,క్వార్టర్లీ,హాఫియర్లీ
ఏదో ఒక పేరుతో ప్రతివారం పరీక్షలు
మంచి రేంకు రాలేదంటూ పెద్దవారి సాధింపులు

నీ సాయంత్రాలు ట్యూషన్లకు బలి
నిదుర ముంచుకొచ్చేదాకా 'హోం వర్కు' తో సరి
పరిగెత్తను చోటు లేక, ఆడుకోను వీలుకాక
'కంప్యూటరు' తో స్నేహం చేస్తావు
'టి.వి' కే నువ్వలవాటు పడతావు

అలాగే నువు పెరుగుతావు
తప్పక ఎంతో ఎదుగుతావు
ఎపుడో నీకన్నీ తెలిసినప్పుడు
వెనుతిరిగి చూసుకుని
నా బాల్యం ఏం చేశారంటూ
నువ్వెవరిని నిలదీస్తావు?
౧౩.౧౦.౦౧

Thursday, November 24, 2011

జడివానలు

ఆకాశానికి మబ్బులొచ్చాయ్
ఆగక కురిసే ధారలొచ్చాయ్
సంద్రం లో తూపానంటూ
ఆకాశవాణి సూచన లొచ్చాయ్

వాగులన్నీ ఉరుకుతాయ్
చెరువులన్నీ నిండుతాయ్
ఏరులన్నీ పొంగుతాయ్
రైళ్ళు బస్సులు ఆగుతాయ్

ఊరులెన్నో జలదిగ్బంధమౌతాయ్
లోతట్టు ప్రాంతాలు - మరలా
వరదనీటను మునుగుతాయ్
పంటకాల్వల గట్లు తెగుతాయ్
ఉన్న పైరులు నష్టమౌతాయ్

అయినా

బీడులన్నీ తడుస్తాయ్
సేద్యాలు చక చక సాగుతాయ్
చేలు పచ్చగ ఎదుగుతాయ్
బంగారు పంటలు పండుతాయ్
రైతుల లోగిళ్ళు నిండుతాయ్
ధరలు అన్నీ సరసమౌతాయ్
ఎందరో అన్నార్తుల ప్రాణాలు నిలుస్తాయ్
ఈ మహానగరం లో నివసించే
నిత్య దాహార్తుల గొంతులు
కొన్నాళ్ళయినా తృప్తిగా తడుస్తాయ్!
౧౧.౧౦.౦౧

Tuesday, November 22, 2011

మీరంతా!

౩౦.౯.౦౧

ఎంత బాగా చేసుకున్నారు ఆ ఉత్సవాలు మీరంతా!
ఎక్కడెక్కడినుండి తరలి వచ్చారు మీరంతా !

కోలాటాలే ఆడారా, హరి కీర్తనలే పాడారా!
చెక్క భజనలే చేసారా, భక్తితొ చిందులు వేసారా!
ఏది చేసినా ఆ దేవునికి ఆత్మ నివేదనగా తలిచారా!

ఎండనుకోక, వాననుకోక ఎదురుతెన్నులే చూసేరా!
ఆకలి అనక నిద్దుర అనక రెప్ప వాల్చక చూసేరా!
మీ అందరి ఆనందంతో ఆ స్వామికి మరిన్ని వన్నెలు చిన్నెలు!
మీ సంతోషమే ప్రతిధ్వనించేను ఆ తిరుపతి కొండలు!

అడుగడుగునా ఆ వెంకన్నకు హారతులే మీరిచ్చేరా!
అణువణువునా అనుభూతులతో మీరెంతో పులకించేరా!
దినమొక క్షణమై అన్నీ మరచి ఉల్లాసంగా గడిపేరా!
గోవిందా హరిగోవిందా అని అనుక్షణమూ పిలిచేరా!

ఇళ్ళకు మరలిపోయే వేళ వెనుక వెనుకకే చూసేరా!
మళ్ళీ మళ్ళీ ఈ భాగ్యం కోరుతు భక్తితొ మీరు మొక్కేరా!

ఏటేటి వేడుకలు

౨౯.౯.౦౧

గరుడధ్వజమెక్కింది
బ్రహ్మరథం కదిలింది
ఇక సాగుతాయి ఉత్సవాలు
మిన్నంటే సంబరాలు

పెద్ద శేషునెక్కేను,చిన్నశేషునెక్కేను
గరుడుడు తనవాడన్నా,ఆ హనుమనూ పిలిచేను
దినమొక నమ్మినబంటు తో వ్యాహ్యాళికి వెడలేను
వారి గొప్పతనము తానే పురవీధుల చాటేను

హంసనెక్కి వచ్చేను ఆ పరమహంస తాను
సింహవాహనుడైనాడు ఆ నారసింహుడే తాను
ఇరుపక్కల దేవేరులతో ముత్యాల పందిరి లోన
కాళియమర్దనుడై ముచ్చటగా సాగేను
ముగ్ధులైన వారి వంక మురిపెంగా చూసేను

తానే కల్పతరువైనట్టి వాడు
కల్పవృక్ష వాహనమున కళలారబోసేను
చెలకోల చేత పట్టి గోపాలుడే తాను
సర్వభూపాల వాహనమున చక్రవర్తి తాను
వెన్నముద్దలారగించే చిన్ని కన్నయ్యే తాను
ఆ హరునే మురిపించిన, అసురులనే మైమరపించిన
మోహిని గా మారేను

ప్రతి దినమూ లాలిపాటల ఉయ్యాల లూగేను
భక్తి పారవశ్యమున జగమే పులకించేను
సూర్య ప్రభ,చంద్ర ప్రభ కోటి ప్రభల దీప్తులతో
కళ్యాణచక్రవర్తి కన్నుల తా నిండేను

వెండి ఏనుగునెక్కిన బంగారు కొండ తాను
బంగారు గుర్రమెక్కిన కల్కిదేవుడు తాను
స్వర్ణ రథమున సాగే వేంకటాద్రి విభుడు తాను
రథయాత్ర జరిపించుకునే జగన్నాథుడే తాను

దినదినమూ తిరువీధులు తీరికగా తిరిగేను
అలసట అని తలవక దర్శనము తానిచ్చేను
చక్ర స్నానం తిలకించేను, సంతృప్తిగ తల పంకించేను
త్వరలోనే మళ్ళీ తిరువీధికి తరలొస్తానని
తన భక్తుల కందరికీ తను మాటను ఇచ్చేను

బ్రహ్మోత్సవాలు

౨౮.౯.౦౧

అంగరంగ వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు
అక్కడి వారందరికీ పెల్లుబికే ఆనందోత్సాహాలు
ఎక్కడెక్కడినుండో వచ్చిన జన సందోహాలు
కోరినవారందరికీ- అలరించే సు'దూరదర్శనాలు'

ఊరంతా తోరణాలు, విద్యున్మణిహారాలు
చిత్రవిచిత్రంగా ఆ పూల అమరికలు
ఆనందనిలయ శిఖరపు మెరిసే పసిడికాంతులు
ఇంద్రధనుసు వర్ణాలే ప్రతిఫలించే కోనేటి జలాలు

కల్యాణకట్ట మెట్లమీద పరుగులు పెట్టే ఎన్నో కాళ్ళు
దిగి వచ్చేటప్పటికి అర్పితమైన నీలాలు
కోరీ దిద్దించుకునే తిరుచూర్ణపు నామాలు
పసిపిల్లలు కూడా మరిచేరు ఆకలిదప్పులు

ఆ స్వామి దర్శనానికి కాయలు కాసే కళ్ళు
కనిపిస్తే ఆ కళ్ళల్లో కోటి దివ్వెల వెలుగులు
ఏ చోటను చూసినా శ్రీహరి ప్రతిరూపాలు
ఏ నోటను విన్నా గోవింద నామాలు

ఇరుపూటల మాడవీధుల తిరువీధులు తిరగడాలు
కన్నుల పండుగ చేసే ఆ నిలువెత్తు గజమాలలు
చూపులు తిప్పనివ్వని వెండి,బంగారు వాహనాలు
కళ్ళార్పనివ్వని వజ్ర, వైడూర్య భూషణాలు

ఆడుగడుగున ఆ స్వామికి అందే నీరాజనాలు
ఆ కాంతులలో మెరిసే ఆయన సమ్మోహకరూపాలు
ప్రతిరాత్రీ రాగడోలల ఊగే ఉయ్యాలలు
ప్రపంచమే మరిచే ఆ భక్తుల హృదయాలు

ఈ ఉత్సవాలు
అక్కడి అధికారుల దక్షతకు పరీక్షలు
అక్కడి సిబ్బంది కార్యదీక్షకు నిదర్శనాలు
ఆ కొండల రాయడి వైభవానికి ప్రతీకలు
చేసిన,చూసినవారికి జన్మ సాఫల్యాలు.

Sunday, November 20, 2011

ఎందరో ఆ తీరంలో

౨౦.౯.౦౧

వ్యాహ్యాళికి వచ్చేవాళ్ళు
వేరుసెనగలు అమ్మేవాళ్ళు
పరుగులు పెట్టే పసివాళ్ళూ
అడుగులు సాగని పెద్దవాళ్ళు

విరుచుకు పడే ఆ కెరటాలను
విభ్రాంతితో చూసేవాళ్ళూ
వాటితోనే ఆటలాడుతూ
కేరింతలు కొట్టేవాళ్ళూ

నిరంతరం వినిపించే ఆ ఘోషకు
భయభ్రాంతులయ్యే వాళ్ళూ
ఆ భాషనే అర్ధంచేసుకు
గంటల తరబడి వినేవాళ్ళూ

తమ లోకంలో తాముండే
ఎన్నో ప్రేమ జంటలూ
అక్కడి కొచ్చినా తమ బాధలు
మరువలేని మధ్య వయసులూ

ఆల్చిప్పలు ఏరేవాళ్ళూ
ముత్యపు చిప్పలు వెతికే వాళ్ళూ

లాభార్జనకై మరపడవలతో
తన సొత్తును దోచేవాళ్ళూ
తరతరాలుగా తమ జీవనభారం
తనపైనే మోపినవాళ్ళూ

చల్లగాలికి సేదదీరి
ఇంటి దారి పట్టేవాళ్ళూ
ఈ లోకంలో ఇమడలేక
తనలోకే నడిచే వాళ్ళూ

ఎందరో ఆ తీరంలో

ఓ వేసవి సాయంకాలం

౨౦.౯.౦౧

ఎక్కడినుండో దూసుకు వచ్చాయ్ ఆ కరిమబ్బుల గుంపులు
వస్తే వచ్చాయ్ సరే, తమలో తామే యుద్ధం చేస్తాయెందుకో మరి!
ఆ కత్తుల రాపిడికే విభ్రాంతి గొలిపే మెరుపులూ
ఆ గంభీర స్వరాలతో భయపెట్టే గర్జనలూ

అపుడపుడూ ఇలాగే ఆర్భాటం చేసీ,
గాలి దేవుడు తరిమేస్తే ఎక్కడికో పారిపోతాయ్
ఈరోజు ఎవరు గెలిచారో ఎవరు ఓడారో కానీ
కలిసికట్టుగా చేసుకుంటున్నాయ్ విజయోత్సవాలు
అదే పనిగ కురిపిస్తున్నాయ్ ఆ అమృత జలధారలు

ఇంతదాకా మండుటెండకు కాగి ఉన్న ఆ భూదేవి
నోరు తెరవకుండానే తాగెయ్యబోతోంది నీళ్లన్నీ!
గొంతు తడుపుకుంటున్న ఆమె సంతృప్త నిశ్వాసం
వెదజల్లే పరిమళానికి సాటి రాదు ఏ సుగంధం

తప్పా? ఒప్పా?

౧౭.౯.౦౧

ఎప్పటి ఆ ప్రశాంతతలో ఏదో కలకలం
ఏమిటా అని చూస్తే తెలిసింది విషయం
టెలిఫోన్ తీగ పైన చక్కనైన చిలకలు
ఉన్న చోట నిలవలేక కలవర పడుతున్నాయి

ఇపుడిపుడే ఎదుగుతున్న ముద్దొచ్చే పిల్లి పిల్ల
పక్కింటి గోడమీద, టెలిఫోన్ తీగ కింద
విలాసంగ పవళించి వినోదమే చూస్తోంది
తన పొద్దుటి ఫలహారానికి ఓపికగా వేచి ఉంది

' ఉష్ ' అంటూ అదిలిస్తే పిల్లి పారిపోయింది
అదే అదనుగా చూసి చిలక లెగిరి పోయాయి

' అమ్మయ్య ' అంటూ నాలుగడుగు లెయ్యగానే
' మ్యావ్ మ్యావ్ ' మనే పిలుపు కాళ్ళ కడ్డు పడింది
నన్నక్కడే నిలబెట్టింది

ఇందాకటి పిల్లి కూన గోడపక్కనే నక్కి
బిక్కు బిక్కుమంటోంది, జాలి చూపు చూస్తోంది
మా వీధికి పహరా కాసే ఆ నల్లటి శునకరాజం
గేటుకెదురుగా ఉండి గుర్రు గుర్రుమంటోంది

ఛీ, ఫో, అని కుక్కని తరిమేసా, పిల్లిని రక్షించా

వాటి ప్రాణం నిలబెట్టేనా?
వీటి కడుపు నే కొట్టేనా?

Thursday, November 17, 2011

ఎవరు మాత్రం!

౧౬.౧౦.౦౧

యుద్ధ మేఘం కమ్ముకొస్తే
రక్త దాహం ముంచుకొస్తే
మనిషి మనిషిని హింస పెడితే
ఎవరు మాత్రం ఏం చేస్తాం!

క్షణములన్నీ యుగములయ్యే
బ్రతుకులే పెనుభారమయ్యే
కష్ట కాలం దాపురిస్తే
ఎవరుమాత్రం ఏం చేస్తాం!

తల్లి మనసే తల్లడిల్లీ
భార్య గుండెలు బద్దలౌతూ
ఊరడిల్లే వార్త కోసం
రేయిపవలూ ఎదురుచూస్తే
ఎవరు మాత్రం ఏంచేస్తాం!

మంచి చెప్పే మతములన్నీ
సంకుచితమై కత్తి దూస్తే
ప్రేమనెంతో పంచగలిగీ
ద్వేషమే మరి పెంచుతుంటే
ఎవరు మాత్రం ఏం చేస్తాం!

భువికి స్వర్గం దింపగలిగే
ప్రతి సృష్టి సైతం చేయగలిగే
విజ్ఞానమే నేడు -
సర్వనాశం చేయడానికి
కంకణాలే కట్టుకుంటే
ఎవరు మాత్రం ఏం చేస్తాం!

గొంతు చించుకు గోడు పెట్టినా
మూగగానే వేడుకున్నా
ఏ దేవుడూ పలకకుంటే
ఈ ప్రళయమే ఆపకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తాం!

Tuesday, November 15, 2011

క్షేమం

౧౫.౦౯.౨౦౦౧

శ్రీకారం లా ప్రతిసారీ ముందు కన్పించే
ఆ మాటంటే చిన్నప్పుడు నాకెంతో చిన్నచూపు
ప్రతి జాబూ(ఉత్తరం) అలాగే ఎందుకు మొదలవ్వాలని ఎంతో వెక్కిరింపు
కానీ, ఆ పదమెంతో అందమైనదనీ
తనలో ఎంతో మధురిమ నింపుకుందనీ
ఎదురుచూసే కన్నులకు అంజనమవుతుందనీ
ఆందోళన నిండిన మనసుకు
క్షణంలో ఆనంద మిస్తుందనీ
అవిసిపోయే గుండెలలో
అమృతమే కురిపిస్తుందనీ
ఈ మధ్యే నాకు తెలిసింది
'మేము క్షేమం' అన్న ఆ రెండు పదాలూ
నా మనసును కుదుట పరిచినా
ఆ అదృష్టం లేని ఎందరో గుర్తొచ్చి
కడుపులో బాధ సుడులు తిరిగింది
గుండె గొంతుక కేమొ అడ్డుపడుతోంది

పది కాలాలూ పచ్చగా!

నిశితంగా పరికించే చూపుండాలి
సాంతమూ వినే ఓర్పుండాలి
సూక్ష్మంగా గ్రహించే నేర్పుండాలి
పెదవులపై సదా చిరునవ్వుండాలి
కళ్ళలో కారుణ్యం తొంగి చూస్తుండాలి
మాట లో చేదుబిళ్ళలు మింగించగలిగే తీపిదనముండాలి
కఠిన పథ్యం చేయించగలిగే లాలిత్యముండాలి
చేతిలో ఉపశమనమిచ్చే మెత్తదనముండాలి
కరకు సూదులు గుచ్చగలిగే, కత్తి గాటులు పెట్టగలిగే కాఠిన్య ముండాలి
సాహసించి నిర్ణయించే తెగువ ఉండాలి
ఎదురు దెబ్బలకు నిలిచే స్థైర్యముండాలి
సరదాలు వదులుకునే త్యాగగుణముండాలి
శ్రమకోర్చి నిలిచే ఆరోగ్యముండాలి
అలసటను మరిపించే అంకితభావముండాలి
అపరాహ్ణమైన,నిశిరాత్రి అయినా
శాంతమూ, సహనమూ తనకు తోడుండాలి
మానవత్వమే చాలదు ఎంతో దైవత్వముండాలి
అటువంటి వైద్యులే మెండుగా ఉండాలి
వారు పదికాలాలూ పచ్చగా ఉండాలి.

Saturday, November 12, 2011

కొన్ని ప్రశ్నలు - ఒక విన్నపం

౧౩.౯.౦౧

ఏ తల్లుల పాలల్లో కలిసింది ఇంత విషం?
ఏ తండ్రుల లాలన లో పెరిగింది ఈ అమానుషం?
ఏ రాక్షస తత్వం పెంచి పోషిస్తోంది ఈ ఉన్మాదం?
ఇప్పుడు రగులుతున్న ఈ ప్రతీకార జ్వాల -
ఇంకా ఎంతమందిని చేస్తుంది భస్మీపటలం?
ఎన్నాళ్ళు సాగుతుంది ఈ దారుణ మారణహోమం?
ఏ మహాశక్తి కోరుతున్నది ఈ నిరంతర బలిదానం?
ఎవరు రచిస్తున్నదీ విషాదభరిత జగన్నాటకం?
ఎవరికి కావలసి వస్తోంది ఇటువంటి లీలావినోదం?

ఎంత కాలమిలా ప్రతిక్షణం భయపడుతూ-
మానీడలు చూసి మేము అనుక్షణం ఉలికిపడుతూ
కన్నుమూసి తెరిచేలోగా,రెప్పపాటు లో కూడా
ఏమవుతుందోనని క్షణక్షణం మా ఊపిరి బిగబడుతూ
ఎదుటివాడిని అనుమానిస్తూ, పొరుగువాడిని ద్వేషిస్తూ
రోజుకిన్ని శవాలు,మరెన్నో జీవచ్చవాలు
మా కళ్ళముందు కదలాడుతుంటే
మాటరాక మూగబోతూ,కదలలేక కూలబడుతూ
ఎంతకాలమిలా?
అయిపోనీ,అంతా అయిపోనీ!
ప్రకృతి సర్వం గర్జించనీ
మహాప్రళయం విరుచుకు పడనీ
ఈ వికృతించిన సృష్టి అంతా
ఒకేసారి లయమైపోనీ
అప్పుడు,
మరోసారి ప్రారంభించే ముందు,
ఒకసారి ఆలోచించు
నీ మనసు కాస్త మార్చుకో!
అంతా మంచినే సృష్టించు, ప్రేమనే వర్షించు
శాంతి, సుహృద్భావాలనే నాటించు
మానవత్వమే పండించు
మనసారా నీ బిడ్డలను దీవించు
నిజమైన నాగరికత వైపు నడిపించు.

దీపావళి

౨౫.౮. ౦౧

మాతోనే ఈ సంబరమంటూ కాంతులు పూసింది కాకరపువ్వొత్తు
నాకు సాటి లేనేలేదంటూ వెలుగులు చిమ్మింది మతాబు
నాకుందా పోటీ అంటూ ఎగసిపడింది చిచ్చుబుడ్డి
వయ్యారం చూడండంటూ గిఱ్ఱున తిరిగింది భూచక్రం
ఓస్,ఇంతేనా అని తన విలాసం చూపింది విష్ణు చక్రం
డాబూ దర్పం మాదేనంటూ హంగు చేశాయి టపాకాయలు
పిల్లలకు మేముంటే చాలంటూ టపటపమన్నాయి తుపాకులు
ఆకాశమే సరిహద్దంటూ దూసుకుపోయాయి రాకెట్లు
మేముకూడా ఉన్నామంటూ మొహమాట పడ్డాయి అగ్గిపెట్టెలు
మీరంతా ఏం చేస్తేనేం అసలందం మాదేనంటూ
మిలమిలలాడాయి వరుసల దివ్వెలు

Thursday, November 10, 2011

మేం

౨౪.౮.౦౧

వాగ్దేవి మా కుల దైవం
కవితాగోష్టి మాకమృతపానం
ప్రకృతి దృశ్యం మనోహరం
కోకిల గానం రసమయం
మాకు లేదు భేషజం
మాకు తెలియదు ఏ ఇజం'
ఎందుకు ఏ స్వర్ణా భరణం?
పుస్తకమే మా భూషణం
మాకు వద్దు ఏ మత తత్వం
మానవత్వమే సమ్మతం
అవును,అవును మేం భావుకులం
కాము ఎన్నడూ ఏకాకులం.

ఏం లాభం?

౨౩.౮.౦౧

శ్రీశైలం కుడి కాలువ
నాగార్జున ఎడమ కాల్వ
సింగూరూ,మంజీరా
తెలుగు గంగ ప్రాజెక్టులు
ఏముంటే ఏం లాభం?
తీరలేదు మన దాహం.
ఇంటర్నెట్ కనెక్షన్లు
ఏటేటా ఎలెక్షన్లు
కొత్త కొత్త సినిమాలకు
హౌసుఫుల్లు కలెక్షన్లు
ఏం వస్తే ఏం లాభం?
తగ్గలేదు సామాన్యుడి జీవనభారం
శ్రమదానం, క్లీను -గ్రీను,
మెగాసిటీ ప్లాన్లూ
ఏమయితే ఏం లాభం?
మారలేదు మన
గతుకు రోడ్ల జాతకం
గీతాయజ్ఞం,గంగాహోమం
అనవరతం అన్నదానం
ఏం చేస్తే ఏం లాభం?
తగ్గలేదు మనిషికి
కాస్తయినా స్వార్థం
రామ రథం, చైతన్య రథం
నాయకులెక్కితే ఏం లాభం?
ఈనాటికి చేరలేదు
మనదేశం ప్రగతి పధం

పుస్తకం

౨౨.౮.౦౧

నా చేతికి తొలి పుస్తకమిచ్చిన వారికి
నా వందనం,కృతజ్ఞతాభి వందనం
మనసు గవాక్షం తెరిపిస్తుంది
నవ్వుల పువ్వులు పూయిస్తుంది
ఊహల రెక్కలు మొలిపిస్తుంది
ప్రపంచమంతా చూపిస్తుంది
బాధలనన్నీ మరిపిస్తుంది
బోధన తానే చేసేస్తుంది
జీవితాంతమూ వాడని చెలిమిది
అక్షరాలా నిజమంటుంది.

Wednesday, November 9, 2011

మరో చిట్టు కవిత

౨౧.౦౮.౦౧

వచ్చేసిన్దోచ్చేసింది చిట్టు లక్ష్మి వచ్చేసింది
మా ఇంటికి తరలొచ్చింది - మా తలుపే తట్టి వచ్చింది
ఆనందం మహదానందం - అంతలోనే కించిత్తు భయం
ఎలా? ఎలా? ఎప్పుడు? ఎపుడు ?
పెట్టేద్దాం పెట్టేద్దాం త్వరలోనే పెట్టేద్దాం
అయిపోతున్దయిపోతుంది ఒక పని అయిపోతుంది
అలాగే, అలాగే. ప్లానింగ్, ప్లానింగ్.
నాలుగు రకాలు నే చేస్తా!
కాదు, కాదు, నేనన్నీ' ఆర్డర్' చేస్తా!
వద్దు వద్దు - లేదు లేదు
సరే,సరే. రాజీ రాజీ. ఓ.కే ఓ.కే ఫిఫ్టీ,ఫిఫ్టీ.
వారం వారం - వచ్చే వారం. కానీ కానీ పిలుపులు కానీ

ఈరోజే చిట్టు పెళ్లి. ఎన్నాళ్ళకు వస్తుందో మళ్ళీ
గుమ్మం కడిగీ, ముగ్గులు పెట్టీ
స్నానం చేసీ,పూజలు చేసీ
ఏది ముందు? ఏది వెనక? అదా,ఇదా? ఇదా, అదా ?
అదీ,ఇదీ - ఇదీ,అదీ కలగా పులగం, తాటంతూటం
అమ్మయ్య అయిపోయింది. నేను రెడీ - నేను రెడీ!
వచ్చేసా రొచ్చేసారు. పెళ్ళివారు విచ్చేశారు
హడావిడిగా కారుల్లో హుటాహుటిన వచ్చేసారు
తలుపులు తీసీ, చాపలు పరిచీ,
ఫానులు వేసీ, మంచి నీళ్లిచ్చీ,
హలో, హలో హలో, హలో
పెద్దల మాటలు, పిల్లల పరుగులు
కేరింతలు, తుళ్ళింతలు, హాస్యోక్తులు, వ్యంగోక్తులు
ఇంటి ఇల్లాలికి ఇక ఏవీ వినపడవు
కావలసినవేవీ కనపడవు
ప్లేట్లూ, స్పూన్లూ కప్పులూ, గ్లాసులూ
ఎక్కడ, ఎక్కడ ఎక్కడ, ఎక్కడ
చీటీ తియ్యడం ఎలా, ఎలా
ప్రతి సారీ కొత్తగా ఈసారీ వింతగా!
నవ్వులు,కేకలు,చప్పట్లు
ఎవరో ఆ నెక్స్టు( next ) వారు?
వారే,వారే - వారికే ఈ జయమాల
హౌసీ, హౌసీ - టిక్కేట్లేవీ ?
కానీ, కానీ వేగం కానీ
ఎవరిది లక్కు? ఏమిటా ట్రిక్కు?
బోగీ వా యాగీ వా?
ఓ పాతిక గుండె కోతలు - బోలెడన్ని నిట్టూర్పులు.
అసలైంది ఆఖరి ఘట్టం
చకచక, చకచక అందించు.
అందుకో కాంప్లిమెంటు
అబ్బో, అబ్బో! బావుంది, బావుంది.
టాటా బై బై
తగ్గిందమ్మా నీ టెన్షన్
వచ్చిందమ్మా డిస్టింక్షన్
బాగా అయింది చిట్ ఫంక్షన్!

నమస్కారం

(౨౦.౮.౦౧)
అమ్మకు నమస్కారం
ఆ జగదంబకు నమస్కారం
అయ్యకు నమస్కారం
బొజ్జ గణపయ్యకు నమస్కారం
దాతకు నమస్కారం
నొసటి రాత రాసిన విధాతకు నమస్కారం
నా నృషి: కురుతే కావ్యం!
కావ్యాలెన్నో రాసిన శిరోమణి తాతకు నమస్కారం
కావ్యాలంటే తెలియని ఋషి మా అసలు తాతకు నమస్కారం
గురువుకు నమస్కారం
వారు నేర్పిన విద్యకు నమస్కారం
ఆడిన మాటా, రాసిన రాతా
నలుగురికీ నచ్చేటట్టూ
పదిమందీ మెచ్చేటట్టూ
అడగకనే వరమిచ్చిన
ఆ పరంధాతకు నమస్కారం

Tuesday, October 25, 2011

వృత్తి ధర్మం

(౨౦.౮.౦౧)

తెల్ల కోటు వేసిందెందుకు?
ప్రాణాలే నిలిపేటందుకు
నల్లకోటు తొడిగిందెందుకు?
న్యాయాన్నే గెలిపించేటందుకు
ఖాఖీ బట్టలు కట్టిందెందుకు?
నేరాలన్నీ అణిచేటందుకు
గురుపీఠం ఎక్కిందెందుకు?
ఆదర్శంగా నిలిచేటందుకు
ఆ విషయాన్నే మరచారంటే
ఆ స్థానంలో మరి మీరెందుకు?

నిన్న - నేడు

(౨౦.౮.౦౧)

సెలయేటి గలగలలెక్కడ?
పూదోటల ఘుమఘుమలెక్కడ?
చక్రవాక రాగాలూ
కోకిలమ్మ పాటలూ
హరిదాసుల కీర్తనలూ
తోలుబొమ్మలాటలూ
అదంతా నిన్నటి మన
'అనాగరిక' గతం
అంతస్తుల మేడలలో
అరుదైన ఉషోదయాలు
కాంక్రీట్ భవనాలలో
ఇరుకు ఇరుకు బతుకులు
ఎంసెట్ యుద్ధాల్లో
అలసిన లేత మనసులు
పక్కవాడి పేరైనా
తెలుసుకోని పెద్దమనషులు
ఇవే నేటి వర్ధిల్లే మన మహానగర జీవితాలు

నా లోని అత్తగారికి

(౨౦.౮.౦౧)

కొత్తకోడలు వచ్చిందంటే
ఏం తెచ్చిందీ అని అడగకు
అందర్నీ వదిలోచ్చిందే
ఆ సంగతి నీవు మరవకు
అత్తరికం చేస్తానంటే
పెద్దరికం వద్దంటుంది
మూతి నువ్వు విరిస్తేనే
ముఖం తాను ముడుస్తుంది
ముందర తలవంచినా
వెనక నుదురు చిట్లిస్తుంది
నీ కూతురు నీ ముద్దుల పట్టే
ఆ పిల్లా ఒక ఇంటి గారాబు బిడ్డే
పిడికెడు ప్రేమా, చిటికెడు సహనం
మాటల పొదుపూ, నాలుక అదుపూ
ఆ నాలుగు నీకుంటే
ఆమెకిక ఎవరు నీకంటే!
మొదటి అడుగు వేసి చూడు
స్నేహ హస్తం చాచి చూడు
తల్లి లాగ అక్కునచేర్చు
నీ నీడగ నిలుస్తుంది
చిరు తప్పులు క్షమియించు
నీ బాటను నడుస్తుంది
మక్కువ తో దీవించు
అమ్మను తా మరుస్తుంది

చిన్నారి చిలకలు

(౨౦.౮.౦౧)

ఎంతో దూరం ఆ దేశం
అక్కడ ఆకులు రాలే కాలం
ఈ పచ్చని తోటను విడిచీ
తమ వెచ్చని గూడును వదిలీ
ఎన్నో చిలకలు ఎగిరి వెళ్ళాయి
సందడంతా తీసుకు పోయాయ్
రెక్కలార్చడం రానేలేదు
లోకమింకా తెలియనేలేదు
బితుకు బితుకు మంటూనే
గాంభీర్యపు ముద్రలతో
సముద్రాలు దాటాయి
కొత్త తీరం చేరాయి
నీడ వెతుక్కుంటాయి
గూడు కట్టుకుంటాయి
పలకరింపు వింటేనే
పులకరించిపోతాయి
అహరహమూ శ్రమిస్తాయి
ఆహామేంతో త్యజిస్తాయి
పండగయినా పబ్బమయినా
నేలతల్లికి గాయమయినా
దూరమయిన పురిటి గడ్డను
ఆర్తితోనే స్మరిస్తాయి
ఎప్పుడో ఒక చిలక
విశ్రాంతికి ఎగిరొస్తే
తోటంతా సంబరం
అది ఎప్పుడయినా వసంతం

Sunday, October 23, 2011

బ్రతుకు హితవు

(౧౯.౮.౦౧)

హిస్టరీల మిస్టరీలు వదిలేసెయ్
వర్తమానం ఫాక్టరీలో పని చేసెయ్
కృతయుగం కావాలనుకోకు
రామరాజ్యం రావాలనుకోకు
గీతాసారం తెలుసుకో
యుగధర్మం తో నడుచుకో!
వాదాలూ భేదాలూ
సిద్ధాంతాలూ, రాద్ధాంతాలూ
టీ కప్పులో తుఫానులే
పేలి ఆరిపోయే దీపావళి టపాసులే
నిశ్శబ్దం బంగారమే కానీ
శబ్దం జీవ చైతన్యం తెలుసుకో!
రంధ్రాన్వేషణ చేసే లోకంలో
నీ తప్పును చూడకు భూతద్దంలో
శిక్షాస్మృతి రాసుకోకు
శిక్ష నీకు వేసుకోకు
ఆ బాధ్యత నీకెందుకు? ఆ పైవాడున్నాడందుకు
ఆదర్శం ఊపిరి గా
దైవత్వం మనకెందుకు
అందరి పాపాలకు శిలువ మోసే
క్రీస్తురికం మనకెందుకు?
మందలో కలిసి గడ్డి మేస్తూ
సాగిపోదాం మునుముందుకు