Tuesday, November 22, 2011

ఏటేటి వేడుకలు

౨౯.౯.౦౧

గరుడధ్వజమెక్కింది
బ్రహ్మరథం కదిలింది
ఇక సాగుతాయి ఉత్సవాలు
మిన్నంటే సంబరాలు

పెద్ద శేషునెక్కేను,చిన్నశేషునెక్కేను
గరుడుడు తనవాడన్నా,ఆ హనుమనూ పిలిచేను
దినమొక నమ్మినబంటు తో వ్యాహ్యాళికి వెడలేను
వారి గొప్పతనము తానే పురవీధుల చాటేను

హంసనెక్కి వచ్చేను ఆ పరమహంస తాను
సింహవాహనుడైనాడు ఆ నారసింహుడే తాను
ఇరుపక్కల దేవేరులతో ముత్యాల పందిరి లోన
కాళియమర్దనుడై ముచ్చటగా సాగేను
ముగ్ధులైన వారి వంక మురిపెంగా చూసేను

తానే కల్పతరువైనట్టి వాడు
కల్పవృక్ష వాహనమున కళలారబోసేను
చెలకోల చేత పట్టి గోపాలుడే తాను
సర్వభూపాల వాహనమున చక్రవర్తి తాను
వెన్నముద్దలారగించే చిన్ని కన్నయ్యే తాను
ఆ హరునే మురిపించిన, అసురులనే మైమరపించిన
మోహిని గా మారేను

ప్రతి దినమూ లాలిపాటల ఉయ్యాల లూగేను
భక్తి పారవశ్యమున జగమే పులకించేను
సూర్య ప్రభ,చంద్ర ప్రభ కోటి ప్రభల దీప్తులతో
కళ్యాణచక్రవర్తి కన్నుల తా నిండేను

వెండి ఏనుగునెక్కిన బంగారు కొండ తాను
బంగారు గుర్రమెక్కిన కల్కిదేవుడు తాను
స్వర్ణ రథమున సాగే వేంకటాద్రి విభుడు తాను
రథయాత్ర జరిపించుకునే జగన్నాథుడే తాను

దినదినమూ తిరువీధులు తీరికగా తిరిగేను
అలసట అని తలవక దర్శనము తానిచ్చేను
చక్ర స్నానం తిలకించేను, సంతృప్తిగ తల పంకించేను
త్వరలోనే మళ్ళీ తిరువీధికి తరలొస్తానని
తన భక్తుల కందరికీ తను మాటను ఇచ్చేను

No comments:

Post a Comment