ఈ జీవన సంధ్యా సమయంలో
నా మది తలుపులు తట్టి
నా ముందర నిలిచాయి
ఏవో ఊహలు
"ఎవరు మీరు?" అని అడిగితే
''కాబోయే కవితలం"
అని గుసగుసగా చెప్పాయి
ముందు చెప్పకుండానే
నేను పిలవకుండానే
వచ్చేసిన ఈ "అనుకోని అతిథులు"
నాకు ఆనందమే తెచ్చాయి
ఒక కొత్త ఉత్సాహమే ఇచ్చాయి
అయినా
అనుమానంగా అడిగేను
ఏం కావాలి మీకని
"కొత్త బట్టలు కావాలి,
నువ్విస్తే
మీఇంట నిలిచుంటాం,
నీ పేరు పెట్టుకుంటాం"
అన్నాయి
"జరీ చీరలు నేయలేను,
తళుకు బెళుకులద్దలేను,
తరతరాలు నిలిచే తత్వం
నేనేమీ మీకివ్వలేను"
అని తటపటాయించేను
చిరునవ్వు నవ్వేయి
ప్రేమగా చూసేయి
"ఆకాశంలో అన్ని చుక్కలున్నాయి,
అన్నిటికీ పేరుందా? ఉన్నా,
అది అందరికీ తెలిసిందా?"
అన్నాయి నెమ్మదిగా!
సందేహాలొదులుకుని
సమాధానపడ్డాను
నా దగ్గర ఉన్న కొద్దిపాటి
పదాలనే పైకి తీసి
అలిబిలి గా అల్లేసి
నా శక్తి ఇదేనంటూ
వాటికి అందించాను
కవితలుగా తాము మారి
కళ్ళముందు నిలిచాక
కళగానే ఉన్నాయి
కిలకిలమన్నాయి
చిన్ని చిన్ని కాంతులతో
ఇల్లంతా తిరుగుతాయి
మా ఇంటికి ఎవరొచ్చినా
తాము పలకరిస్తాయి.
౧౯.౧౦.౦౧
No comments:
Post a Comment