Saturday, November 12, 2011

కొన్ని ప్రశ్నలు - ఒక విన్నపం

౧౩.౯.౦౧

ఏ తల్లుల పాలల్లో కలిసింది ఇంత విషం?
ఏ తండ్రుల లాలన లో పెరిగింది ఈ అమానుషం?
ఏ రాక్షస తత్వం పెంచి పోషిస్తోంది ఈ ఉన్మాదం?
ఇప్పుడు రగులుతున్న ఈ ప్రతీకార జ్వాల -
ఇంకా ఎంతమందిని చేస్తుంది భస్మీపటలం?
ఎన్నాళ్ళు సాగుతుంది ఈ దారుణ మారణహోమం?
ఏ మహాశక్తి కోరుతున్నది ఈ నిరంతర బలిదానం?
ఎవరు రచిస్తున్నదీ విషాదభరిత జగన్నాటకం?
ఎవరికి కావలసి వస్తోంది ఇటువంటి లీలావినోదం?

ఎంత కాలమిలా ప్రతిక్షణం భయపడుతూ-
మానీడలు చూసి మేము అనుక్షణం ఉలికిపడుతూ
కన్నుమూసి తెరిచేలోగా,రెప్పపాటు లో కూడా
ఏమవుతుందోనని క్షణక్షణం మా ఊపిరి బిగబడుతూ
ఎదుటివాడిని అనుమానిస్తూ, పొరుగువాడిని ద్వేషిస్తూ
రోజుకిన్ని శవాలు,మరెన్నో జీవచ్చవాలు
మా కళ్ళముందు కదలాడుతుంటే
మాటరాక మూగబోతూ,కదలలేక కూలబడుతూ
ఎంతకాలమిలా?
అయిపోనీ,అంతా అయిపోనీ!
ప్రకృతి సర్వం గర్జించనీ
మహాప్రళయం విరుచుకు పడనీ
ఈ వికృతించిన సృష్టి అంతా
ఒకేసారి లయమైపోనీ
అప్పుడు,
మరోసారి ప్రారంభించే ముందు,
ఒకసారి ఆలోచించు
నీ మనసు కాస్త మార్చుకో!
అంతా మంచినే సృష్టించు, ప్రేమనే వర్షించు
శాంతి, సుహృద్భావాలనే నాటించు
మానవత్వమే పండించు
మనసారా నీ బిడ్డలను దీవించు
నిజమైన నాగరికత వైపు నడిపించు.

No comments:

Post a Comment