Tuesday, December 6, 2011

నా మహానగరం

ఆరంతస్థుల మేడపైనుండి
ఆశ్చర్యం నిండిన కళ్ళతో
చూస్తూ నిలచి పోయానొక
అద్భుత దృశ్యాన్ని ఆ రాత్రి

పిడికిళ్ళతో విరజిమ్మిన
వజ్రాల ధగధగలు ఒక వైపు
హారాలుగా తీర్చిన వైడూర్యాలు ఇంకొక వైపు
మంచి ముత్యాల తోరణాలు మరో వయిపు
అందంగా పొదిగిన కెంపులూ, నీలాలూ, పచ్చలూ అక్కడక్కడా!

మణిమయమై భాసిల్లుతోంది
ఎల్లలు దాటిన ఈ మహానగర సౌందర్యం

అక్కడ, ఆపైన నిలచి ఉన్నప్పుడు
హోరెత్తించే రణగొణ ధ్వనులు వినపడలేదు;
అదృష్టవశాత్తూ - పేరు తెలియని ఫ్యాక్టరీలు వదిలే
విష వాయువులు చుట్టుముట్టలేదు;
రోడ్ల పక్కన పెంట కుప్పలు,
అన్ని దిక్కులా పరుచుకున్న వాడేసిన ప్లాస్టిక్ కవర్లు
కనిపించలేదు

నాకు తెలుసు,
ఆ దీపాల తోరణాలు కట్టిన వీధులలో
గోముఖ వ్యాఘ్రాలు తిరుగుతుంటాయని
ఆ జనారణ్యంలో, చీకటి మూలలలో
తోడేళ్ళు అవకాశం కోసం మాటువేసి వేచి ఉంటాయనీ

ఆ సిమెంట్ వనాలలో దీపపు క్రీనీడలలో
దోపిడీలు, దౌర్జన్యాలు సర్వసామాన్యమనీ
సాటిమనిషి చేసే ఆర్తనాదం అరణ్య రోదనమేననీ
మేడమెట్లు దిగి వస్తే ఆ సెగలూ, పొగలూ
నన్ను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయనీ

అయినా,
ఆ ఆలోచనలన్నీ మరిచి నిలిచాను
సంభ్రమంగా చుట్టూ చూసాను

మనిషి సాధించుకున్న అద్భుత ప్రపంచమది
రాత్రికి, పగటికి తేడా తెలియనివ్వనంటోంది

దూరదూరాల నుండి తరలి వచ్చే వారిని
అక్కున చేర్చుకుంటోంది
బ్రతుకు తెరువు చూపించి
బ్రతక మంటోంది

ప్రేమిస్తాను - ఈ నగరాన్ని,
కాంక్షిస్తాను - దాని పురోభివృద్దిని,
కోరుకుంటాను - దానికి జరా,మరణాలు వద్దని.
౧౪.౦౩.౦౩

No comments:

Post a Comment