౧౬.౧౦.౦౧
యుద్ధ మేఘం కమ్ముకొస్తే
రక్త దాహం ముంచుకొస్తే
మనిషి మనిషిని హింస పెడితే
ఎవరు మాత్రం ఏం చేస్తాం!
క్షణములన్నీ యుగములయ్యే
బ్రతుకులే పెనుభారమయ్యే
కష్ట కాలం దాపురిస్తే
ఎవరుమాత్రం ఏం చేస్తాం!
తల్లి మనసే తల్లడిల్లీ
భార్య గుండెలు బద్దలౌతూ
ఊరడిల్లే వార్త కోసం
రేయిపవలూ ఎదురుచూస్తే
ఎవరు మాత్రం ఏంచేస్తాం!
మంచి చెప్పే మతములన్నీ
సంకుచితమై కత్తి దూస్తే
ప్రేమనెంతో పంచగలిగీ
ద్వేషమే మరి పెంచుతుంటే
ఎవరు మాత్రం ఏం చేస్తాం!
భువికి స్వర్గం దింపగలిగే
ప్రతి సృష్టి సైతం చేయగలిగే
విజ్ఞానమే నేడు -
సర్వనాశం చేయడానికి
కంకణాలే కట్టుకుంటే
ఎవరు మాత్రం ఏం చేస్తాం!
గొంతు చించుకు గోడు పెట్టినా
మూగగానే వేడుకున్నా
ఏ దేవుడూ పలకకుంటే
ఈ ప్రళయమే ఆపకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తాం!
No comments:
Post a Comment