పట్టుచీర కట్టింది
బుట్టజూకాలు పెట్టింది
చక్కనైన వడ్డాణానికి
నడుము కాస్త చిక్కింది
అందమైన పూలజడ
ఒద్దికగా అమరింది
బంగారు గాజుల మిలమిలలు
మట్టి గాజుల గలగలలు
కలహంస నడకలకు
జతలయ్యే మంజీర నాదాలు
కెంపులు పూసిన గోరింట చేతులకు
పోటీ కాదా ఆ పారాణి పాదాలు!
తొంగి చూస్తోంది తలపైనుండి
మంచి ముత్యాల పాపిడి చేరు
అన్నిటికన్నా అపురూపం
ఆ నొసటన కళ్యాణ తిలకం
చెడు చూపు పడనివ్వని
ఆ దిష్టి చుక్కే అందం
ఆమె శిరసు వంగుతోంది మాటిమాటికీ
తలలోని మల్లెల బరువుకా
ముంచుకొస్తున్న సిగ్గుల భారానికా!
పరిహాస మాడితే బుగ్గల్లో గులాబీలు
చిరుకోపం నటించి బిగబట్టినా పెదాలు
ఆమెకది ఇష్టమేనని చెపుతున్నాయామె కళ్ళు
ముగ్ధంగా, స్నిగ్ధంగా, ముచ్చటగా ఉన్నాది
బుట్టలో కూచోబోయే బుట్టబొమ్మ ఆ కొమ్మ
ఆ కొబ్బరాకు పందిళ్ళు తనకోసం
ఆ మామిడాకు తోరణాలు తనకోసం
ఆ అందాల ముగ్గులు తనకోసం
ఆ సన్నాయి మేళాలు తనకోసం
ఆ పన్నీరు అత్తర్లు తనకోసం
ఆ చెమ్కీల దండలు తనకోసం
ఆ ఇల్లంతా సందళ్ళు తనకోసం
అందరూ వెతికేది తనకోసం
కానీ
తనచూపు వెతికేది ఎవరికోసం!
ఇక గడియో, క్షణమో
తన ముంగిట నిలిచే,
జీవితాంతమూ తన తోడై నడిచే,
ఆ కళ్యాణ సుందరుడికోసం,
ఆ తన మనోహరుడికోసం.
౧౪.౧౦.౦౧
No comments:
Post a Comment