Saturday, November 26, 2011

పెద్దలకు మాత్రమే

చిటి చిటి పరుగుల చిట్టిపాపా!
అమ్మ చెయ్యి వదలని ముద్దుపాపా!
దోచబోతారమ్మా నీ బంగారు బాల్యాన్ని
చేర్చబోతారమ్మా నిన్నొక 'స్కూల్' లోని

పొద్దున్నే నిను లేపేస్తారు
గబగబ పళ్ళు రుద్దేస్తారు
చకచక నీళ్ళు పోసేస్తారు
'యూనిఫాం' తగిలిస్తారు
వద్దన్నా 'టై ' బిగిస్తారు

నోట్లో 'టిఫిన్' కూరేస్తారు
వేడిపాలు పట్టేస్తారు
కత్తిరించిన పొట్టిజుత్తును
హడావిడిగా దువ్వేస్తారు

పాదాలకు తొడుగులు తొడిగి
'బూటు'లలో బంధిస్తారు
బిరబిర చరచర లాక్కుపోయి
అక్కడ వదిలేసొచ్చేస్తారు

గోరుముద్దలు ఇక డబ్బాలపాలు
కరవేలే నీకిక అమ్మ మురిపాలు
అక్కడంతా 'డిసిప్లిన్'
అందరికీ దొరకదు 'ఎఫెక్షన్'

హిస్టరీలు,జాగ్రఫీలు,'జనరల్ నాలెడ్జి'
హడలేసే లెక్కలు, 'ఐన్ స్టీన్' సూత్రాలు
ఒకటో తరగతికే గోతాముడు పుస్తకాలు
స్లిప్ టెస్టులు,యూనిట్లు,క్వార్టర్లీ,హాఫియర్లీ
ఏదో ఒక పేరుతో ప్రతివారం పరీక్షలు
మంచి రేంకు రాలేదంటూ పెద్దవారి సాధింపులు

నీ సాయంత్రాలు ట్యూషన్లకు బలి
నిదుర ముంచుకొచ్చేదాకా 'హోం వర్కు' తో సరి
పరిగెత్తను చోటు లేక, ఆడుకోను వీలుకాక
'కంప్యూటరు' తో స్నేహం చేస్తావు
'టి.వి' కే నువ్వలవాటు పడతావు

అలాగే నువు పెరుగుతావు
తప్పక ఎంతో ఎదుగుతావు
ఎపుడో నీకన్నీ తెలిసినప్పుడు
వెనుతిరిగి చూసుకుని
నా బాల్యం ఏం చేశారంటూ
నువ్వెవరిని నిలదీస్తావు?
౧౩.౧౦.౦౧

No comments:

Post a Comment