Tuesday, November 22, 2011

బ్రహ్మోత్సవాలు

౨౮.౯.౦౧

అంగరంగ వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు
అక్కడి వారందరికీ పెల్లుబికే ఆనందోత్సాహాలు
ఎక్కడెక్కడినుండో వచ్చిన జన సందోహాలు
కోరినవారందరికీ- అలరించే సు'దూరదర్శనాలు'

ఊరంతా తోరణాలు, విద్యున్మణిహారాలు
చిత్రవిచిత్రంగా ఆ పూల అమరికలు
ఆనందనిలయ శిఖరపు మెరిసే పసిడికాంతులు
ఇంద్రధనుసు వర్ణాలే ప్రతిఫలించే కోనేటి జలాలు

కల్యాణకట్ట మెట్లమీద పరుగులు పెట్టే ఎన్నో కాళ్ళు
దిగి వచ్చేటప్పటికి అర్పితమైన నీలాలు
కోరీ దిద్దించుకునే తిరుచూర్ణపు నామాలు
పసిపిల్లలు కూడా మరిచేరు ఆకలిదప్పులు

ఆ స్వామి దర్శనానికి కాయలు కాసే కళ్ళు
కనిపిస్తే ఆ కళ్ళల్లో కోటి దివ్వెల వెలుగులు
ఏ చోటను చూసినా శ్రీహరి ప్రతిరూపాలు
ఏ నోటను విన్నా గోవింద నామాలు

ఇరుపూటల మాడవీధుల తిరువీధులు తిరగడాలు
కన్నుల పండుగ చేసే ఆ నిలువెత్తు గజమాలలు
చూపులు తిప్పనివ్వని వెండి,బంగారు వాహనాలు
కళ్ళార్పనివ్వని వజ్ర, వైడూర్య భూషణాలు

ఆడుగడుగున ఆ స్వామికి అందే నీరాజనాలు
ఆ కాంతులలో మెరిసే ఆయన సమ్మోహకరూపాలు
ప్రతిరాత్రీ రాగడోలల ఊగే ఉయ్యాలలు
ప్రపంచమే మరిచే ఆ భక్తుల హృదయాలు

ఈ ఉత్సవాలు
అక్కడి అధికారుల దక్షతకు పరీక్షలు
అక్కడి సిబ్బంది కార్యదీక్షకు నిదర్శనాలు
ఆ కొండల రాయడి వైభవానికి ప్రతీకలు
చేసిన,చూసినవారికి జన్మ సాఫల్యాలు.

No comments:

Post a Comment